హోమ్ పేజీకి తిరిగి వెళ్లండి
పూజ్య దాజీ (కమలేష్ డి. పటేల్)
🙏 పూజ్య దాజీ
దాజీ 71వ జన్మదిన సందేశం

సముద్రాన్ని కనుగొన్న నది

ప్రేమ తన మార్గాన్ని కనుగొన్నప్పుడు

28 సెప్టెంబర్ 2026
•
కాన్హా శాంతి వనం, హైదరాబాద్
•
7 నిమిషాల పఠనం

ప్రియ మిత్రులారా,

ఈ సందేశంలో, ప్రేమ తన అసలైన నివాసానికి వెళ్లే మార్గాన్ని కనుగొన్నప్పుడు, సంభవించే ఆ మలుపును గురించి మనం ఆలోచిద్దాం. కానీ మనం వెళ్లడానికి ముందు కొద్దిసేపు ఆగుదాం.

ఆత్మపరిశీలన ప్రశ్న 1

"మనం ప్రేమించినప్పుడు, మన ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? అది తనను ఆకర్షించిన చోట అటు ఇటూ తిరుగుతుందా? లేదా నిశ్శబ్దంగా ఎక్కడికైనా పయనిస్తోందా?"

ఆత్మపరిశీలన ప్రశ్న 2

"అలాగే మనం 'స్వగృహం' అంటున్నప్పుడు, మన ఉద్దేశం ఏమిటి? అది మనం ఎప్పుడో వెనుక వదిలిపెట్టి వచ్చిన ఒక ప్రదేశమా లేదా ఇప్పటికీ మన కోసం నిరంతరం ఎదురుచూస్తున్న ఒక ప్రదేశమా?"

ఈ ప్రశ్నలను మీ హృదయంలోనే కాసేపు విశ్రమించనివ్వండి. వాటికి సమాధానాలు చెప్పవలసిన అవసరం లేదు. కేవలం అవి చూపించే దిశ యొక్క అనుభూతిని పొందండి.

సముద్రం వైపునకు ప్రవహిస్తున్న నది యొక్క ఊహాచిత్రం

🌊 వరదలో ఉన్న నది

వరదలో ఉన్న నది ఒకేసారి అన్ని దిశలకూ ప్రవహిస్తుంది. దానికి గొప్ప శక్తి ఉంటుంది, కానీ దిశ ఉండదు. నీరు నేలను కప్పి, లోతులను నింపి, తన ముందున్నదాన్నంతా ముంచెత్తుతుంది. అది వెనక్కి తగ్గినప్పుడు అక్కడ మిగిలేది బురద మాత్రమే.

🧭 మార్గం చూపబడిన నది

అదే నీరు, తనకు మార్గం చూపబడినప్పుడు, లోయలను చెక్కుతుంది, టర్బైన్లను తిప్పుతుంది, నౌకలను సముద్రానికి తీసుకెళ్తుంది. నీరు అదే. దాని శక్తి కూడా అదే. అది ఒక దిశను కనుగొనడం అనేదే మారింది.

“తన చుట్టూ ఉన్నదాన్నంతటిని ప్రేమించే హృదయానికి, ప్రేమలో తన ఇంటికి దారి కనుగొన్న హృదయానికి మధ్య ఉన్న తేడా అదే.”

02

ముఖ్యమైన మలుపు

గత సందేశంలో, ఒక పువ్వు యొక్క పరిమళంలా హృదయంలో ప్రేమ ఎలా వికసిస్తుందో మనం చూశాము. అది మన ఎంపిక కాదు, అది హృదయం నుండి ఉప్పొంగిన ప్రవాహం. కృపతో హృదయ పాత్ర నిండినప్పుడు, ప్రేమ పొంగిపొర్లింది. కానీ, కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ప్రేమ అన్నిదిశల్లో ప్రకాశించినప్పుడు, అది వరదతో ఉన్న నదిలాంటిది. అది తన ప్రవాహంలో దేనినీ మినహాయించకుండా, సమస్తాన్నీ ఆలింగనం చేసుకుంటుంది. తన ఉదార స్వభావంతో అది నిరంతరాయంగా అలా సాగిపోగలదు; కానీ, తను చేరుకోవలసిన ఆ ఏకైక గమ్యాన్ని మాత్రం ఎన్నటికీ చేరుకోకపోవచ్చు.

దిక్సూచి సూది ఉత్తర దిశను కనుగొన్నట్లుగా

అంతటా పొంగిపొర్లుతున్న ప్రేమ, మళ్లడం ప్రారంభిస్తుంది. ఇది, స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక దిక్సూచి సూది అకస్మాత్తుగా ఉత్తర దిశను కనుగొన్నట్లుగా ఉంటుంది. తాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ ప్రదేశం కోసం, మొట్టమొదటిగా తన పాత్రను నింపిన ఆ సాన్నిధ్యం కోసం పరితపించడం ప్రారంభిస్తుంది. ఈ మలుపు, ప్రేమ తగ్గిపోవడం కాదు; అది మరింత గాఢంగా, లోతుగా మారడమే!

నది తన నీటిని కోల్పోలేదు; అది తన తీరాలను కనుగొన్నది. ఆ తీరాలే దానిని సముద్రం వైపునకు తీసుకెళ్తాయి.

ॐ

నారద భక్తి సూత్రం

« సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప »

భగవంతుని వైపు మళ్లిన అత్యున్నత ప్రేమే భక్తి అంటే.

నారద మహర్షి లౌకిక ప్రేమ గురించో లేదా ఒక అసాధారణమైన ప్రేమ గురించో మాట్లాడటం లేదు. హృదయం యొక్క తీక్షణత అంతా ఒకే దిశగా లక్షితమై, అన్ని ప్రేమలకన్నా శ్రేష్ఠమై ఉన్న ఆ పరమ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నారు.

పూజ్య బాబూజీ మహారాజ్

“అందరినీ ప్రేమించే ఆయనను ప్రేమించు.”

పూజ్య చారీజీ మహారాజ్

“ఆయన ప్రేమించే అందరినీ ప్రేమించు.”

తన మార్గాన్ని కనుగొన్న నది ఇవ్వడాన్ని ఆపదు. దాని తీరాల వెంబడి ఉన్న పొలాలన్నీ పోషణ పొందుతూ పచ్చగా ఉంటాయి.

03

అన్ని కోరికలను శాంతింపజేసే కోరిక

ఈ ప్రయాణంలోని మొదటి సందేశమైన 'విభజింపబడిన హృదయం’లో, కోరిక అన్వేషకుడిని ఒకేసారి రెండు దిశలవైపు లాగడాన్ని మనం చూశాము. ఒక తోడేలు సుపరిచితమైన దానివైపు లాగితే, మరొకటి ప్రకాశవంతమైన దానివైపు లాగింది. ఆ హృదయం చీలిపోయింది. అది రెండింటినీ కోరుకుంది, కానీ ఎంచుకోలేకపోయింది. మనం గుర్తించిన మొదటి అడ్డంకి. ఆ విభజనే, దానికి మూలం మనలోని భయం అని మనం తెలుసుకున్నాము.

పదకొండవ సందేశం • కోరికల ఏకీకరణ

భక్తి అంటే కోరిక లేకపోవడం కాదు. అది కోరికల ఏకీకరణ.

హృదయాన్ని ఒకేసారి అన్ని దిశలకూ ఎగిరేలా చేసిన చెల్లాచెదురైన తపనలు, విరిగిన ఆశలు, సహనం లేని తపనలు అన్నీ ఇప్పుడు ఒకే ప్రవాహంగా కలుస్తాయి. అవి ఒకే గమ్యానికి ప్రవహిస్తాయి. హృదయం ఇక విభజించబడి లేదు. అది కోరుకోవడం ఆపలేదు. చివరికి అది సంపూర్ణంగా కోరుకోదగిన ఏకైక వస్తువును కనుగొంది.

బాబూజీ చూపిన ఒక ముఖ్యమైన వ్యత్యాసం దీనిపై తన వెలుగుని ప్రసరిస్తుంది. నిజమైన భక్తి, ఇంద్రియాల భౌతికపరమైన కోరికల నుండి విముక్తమై ఉంటుంది అని ఆయన అంటారు. అది అసలైన తపనచే ప్రేరేపించబడుతుంది; ఆ తపన తీరినప్పుడు, దాని స్థానంలో మరింత ఎక్కువ తపనను అది సృష్టించదు. అది అన్ని తపనలనూ అంతం చేస్తుంది.

దాని అర్థం ఏమిటో మనం పరిశీలిద్దాం:

లౌకికపరమైన ప్రతి కోరిక, ఒకసారి తీరిన వెంటనే, మరొకదాన్ని పుట్టిస్తుంది. మనకు ప్రమోషన్ కావాలి; అది వచ్చిన కొన్ని వారాలకే తదుపరి ప్రమోషన్ కావాలని కోరుకుంటాం. మనకు ఇల్లు కావాలి; దాన్ని కొనుగోలు చేసిన నాటి నుండే ఇంకా పెద్ద ఇల్లు గురించి కలలు కంటాం. కోరిక తీరడం తదుపరి అవసరాన్ని పుట్టిస్తుంది, ఈ చక్రం ఎప్పటికీ ఆగదు.

“భక్తి అనేది ఎలాంటి ఆర్తి అంటే; అది తీరినప్పుడు మరొక తలుపు తెరవబడదు. అది తలుపుల అవసరాన్నే పూర్తిగా కరిగించి వేస్తుంది.”
దాజీ వ్యక్తిగత అనుభవం • సంభాషణ

నేను ఒకసారి ఎవరినో అడిగాను, ‘మీరు ఏడు సంవత్సరాల వయసులో అత్యంత ఎక్కువగా దేన్ని కోరుకున్నారు?’

అతను ఒక క్షణం ఆగి, ‘ఒక ఎరుపు రంగు సైకిల్. అప్పుడది మా తాహతుకు మించినది కాబట్టి దానికోసం నేను ఏడ్చాను’ అన్నాడు.

‘మరి ఇప్పుడు?’ అని అడిగాను.

అతను చిన్నగా నవ్వి, ‘ఇప్పుడు నా దగ్గర మూడు కార్లు ఉన్నాయి. ఆ సైకిల్ కావాలనే కోరిక ఎప్పుడు పోయిందో కూడా నాకు గుర్తు లేదు,’ అన్నాడు.

అతను ఆ కోరికతో పోరాడలేదు, కేవలం దానిని అధిగమించాడు. దాని స్థానంలో మరింత పెద్ద కోరిక వచ్చింది. ఇంకా గొప్పదైన దానితో భర్తీ చేయడం ద్వారా, ప్రపంచం కోరికను ఈవిధంగా తీరుస్తుంది. భక్తి దానిని వేరేవిధంగా నయం చేస్తుంది. హృదయం దివ్యప్రేమతో నిండినప్పుడు, పాత కోరికలను భర్తీ చేయడానికి మరింకేదీ అవసరం ఉండదు. అవి సూర్యకాంతిలో కొవ్వొత్తుల్లా, కేవలం అసంగతమైనవిగా మారిపోతాయి.
04

రుజువు అవసరం లేని విశ్వాసం

సులభంగా ఉపేక్షించబడే మరొక విషయాన్ని నారదుడు చెబుతున్నారు:

నారద భక్తి సూత్రం

« స్వయం ప్రమాణత్వాత్ »

భక్తి దానికదే స్వయం ప్రమాణం.

అది స్వీయ విదితం. దాని ఆనందం, శాంతి స్పష్టంగా కనిపిస్తాయి. నిజమైన భక్తిని అనేక నకిలీల నుండి వేరు చేయడానికి ఇదే అత్యంత కచ్చితమైన మార్గం. మనం భక్తితో ఉన్నామని మనల్ని మనమే నమ్మించుకోవాల్సివస్తే, మనం భక్తితో లేనట్లే. ప్రేక్షకుల కోసం భక్తిని ఆచరిస్తే, అది నాటకం మాత్రమే, అది భక్తి కాదు.

🍽️ ఆకలిలా స్వీయ విదితం

నిజమైన భక్తి ఆకలిలాగే స్వీయ విదితం. మనం ఆకలితో ఉన్నామని ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే సందేహానికి భక్తి సహజమైన పరిష్కారం.

🌊 నదిలో నీరు ఉన్నట్లు

పదకొండు సంవత్సరాల ధ్యానం తర్వాత కూడా కొందరు ‘ఇది నిజమా?’ అని అడుగుతారు. కానీ భక్తిలో ప్రవేశించిన హృదయం ఆ ప్రశ్నను అడగదు. మనం నదిలో నిలబడి ఉన్నప్పుడు, అక్కడ నీరు ఉందా అని అడగము.

05

భక్తి, జీవితానికి ఏమి చేస్తుంది

భక్తి లేకుండా, మనమేం ఆలోచించినా లేదా చేసినా, దానిలో సజీవమైన ఉత్సాహం, ఆనందం ఉండవు; అందువల్ల దానికి మాధుర్యం కూడా ఉండదు. అంతరంగ యాత్రలో భక్తి మన జీవనరేఖ. ప్రాణాహుతి హృదయంలోకి పంపే ప్రేమ కిరణంతో అది మనలను అనుసంధానంలో ఉంచుతుంది. మరింత కచ్చితంగా చెప్పాలంటే, ఆ కిరణాన్ని భక్తి లోపలికి ఆకర్షిస్తుంది. కేవలం స్వీకరించే హృదయానికి, తపించే హృదయానికి మధ్య తేడా ఉంది. రెండూ ఆశీర్వదించబడినవే. అయితే ఎండిపోయిన నేల, నీటిని పీల్చుకున్నట్లు, తపించే హృదయం ఆ కిరణాన్ని మరింత లోతుగా లాక్కుంటుంది.

నిత్య సాధనల తీరాలు

మరి ఆ తీరాలు ఎక్కడ ఉన్నాయి?

ఇవి లేకుంటే నీరు అన్ని దిశలకూ ప్రవహించి, చివరికి కనుమరుగైపోతుంది:

🌅

ఉదయపు ధ్యానం

హృదయాన్ని దివ్య సాన్నిధ్యంతో మేల్కొలిపే ప్రాతఃకాల సాధన

✨

సాయంత్రపు నిర్మలీకరణ

రోజువారీ సంస్కారాలను తొలగించి హృదయాన్ని స్వచ్ఛం చేయడం

🌙

నిద్రకు ముందు ప్రార్థన

సమర్పణా భావంతో ప్రియతముని ఒడిలో విశ్రమించడం

🕊️

నిరంతర స్మరణ

రోజంతా ప్రతి క్షణం హృదయంలో ప్రియతముని ఎరుక

స్వయంగా జీవితమే ప్రార్థనగా మారుతుంది

అప్పుడు అన్వేషకుని సంపూర్ణ జీవితాన్ని మార్చే పరివర్తన వస్తుంది. ప్రతీ పని, అది ఎంత చిన్నదైనా, ప్రియతమునికి సమర్పించబడినప్పుడు, ఆరాధనగా మారుతుంది. మనకు దేవాలయాలు గానీ, ఆచారాలు గానీ అవసరం లేదు.

  • మొదటి గ్లాసు నీటిని ఉదయం మౌనంగా దైవానికి అర్పించినప్పుడు, అది భక్తిగా మారుతుంది.
  • ప్రియతముని సాన్నిధ్యపు ఎరుకతో మనం చేసే పని భక్తిగా మారుతుంది.
  • కఠినమైన సహోద్యోగి పట్ల మనం చూపే సహనం, మనకు నష్టం వచ్చినా మనం పలికే సత్యం, ప్రతిఫలం ఆశించకుండా మనం ఇచ్చే ప్రేమ...

“పవిత్రమైనదీ, మరియు సాధారణమైనదీ, విభజనలేని ఒకే ప్రవాహంలో కలిసిపోతాయి.”

06

నది ఎక్కడకు ప్రవహిస్తుంది

మనం ఒక నది, దాని తీరాలతో ప్రారంభించాము. నది ఆలోచించగలిగితే అది అడిగే ప్రశ్నను ఇప్పుడు మనం అడుగుదాం: నేను సముద్రాన్ని చేరినప్పుడు, ఏమి జరుగుతుంది?

సముద్రం నదిలోనికి దూసుకుపోదు, అలాగే నది కూడా సముద్రాన్ని జయించదు. నదికి ఒక దారిని, బలాన్ని ఇచ్చిన నదీతీరాలు నిశ్శబ్దంగా విడిచిపెట్టబడతాయి. లోయలను చెక్కిన ప్రవాహం మృదువుగా మారుతుంది.

“నది మరణించలేదు. అది సముద్రమైంది.”

'నేను ఒక నదిని' అని చెప్పిన ఒక గుర్తింపు, 'నది' అనే పదం ఇక వర్తించనంతగా విస్తారమైన మరో దానిలో కరిగిపోతుంది. అయినప్పటికీ ఏదీ కోల్పోబడలేదు. నదిగా ఉన్న నీరంతా ఇప్పుడు సముద్రమైంది. అది స్వేచ్ఛగా అయ్యింది.

మేఘాల నుండి తిరిగి సముద్రానికి:

ఆ నదిలోని ప్రతి బిందువూ ఒకప్పుడు సముద్రం నుండి పొగమంచుగా పైకెగిసింది. అది మేఘంగా తేలి, సుదూరపు కొండలపై వర్షంగా కురిసి, తాము ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా తెలియని వాగుల్లో చేరింది. ఆ నది ఏదో పరాయి దేశానికి ప్రయాణించడం లేదు. అది తన ఇంటికి వెళ్తోంది.

ప్రేమ ఎక్కడికి వెళ్తుంది?

ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్తుంది. గృహం అనేది మన వెనుకా లేదు, మన ముందూ లేదు. నీటిని ఎప్పటినుంచో రమ్మని పిలుస్తూ ఉన్న సముద్రమే ఆ గృహం.
పూజ్య బాబూజీ శరణాగతి తత్త్వం

ఈవిధంగా సమర్పించుకోవడం, తీరాలను విడిచిపెట్టడం, మనస్సు ఊహించలేని దానిలో మన వ్యక్తిత్వాన్ని కరిగించి వేయడాన్నే బాబూజీ, శరణాగతి అని పిలుస్తారు.

మనలోని ఆ అంతరంగ మలుపును మనం అనుభూతి చెందినా, మన ప్రేమ సరైన దిశను కనుగొనడం ప్రారంభించినా, ఆ సముద్రాన్ని మనం సుదూరంనుండి వీక్షించినా, మనలో భక్తి తన పనిని ప్రారంభించినట్లే! మనం కేవలం ఆ నదీ తీరాలను అనుసరిస్తూ సాగిపోతే చాలు. మార్గం వాటికి తెలుసు.

ప్రేమతో, ప్రార్థనలతో,

కమలేష్

పూజ్య దాజీ 71వ జన్మదినోత్సవ సందర్భంగా • 28 సెప్టెంబర్ 2026 • కాన్హా శాంతి వనం